చరిత్ర పరిరక్షణలో 8 ఏళ్ళుBack to list

 2010 వ సంవత్సరం, సరిగ్గా ఇదే రోజు ,ఎనిమిదేళ్ల క్రితం వారం రోజుల ముందు నుండి మేము చేసిన ప్రచారం , ఊరూరా ఫ్లెక్సీ లు , మనఘంటసాల. నెట్ వెబ్సైట్ ప్రారంభోత్సవం అంటూ ఇంటింటికీ పంపిన ఆహ్వానాలతో , పిల్లా పెద్దా అందరూ సాయంత్రం  గంటల కల్లా జలధీశ్వరాలయం ముందు ఆసీనులయ్యారు. గ్రామానికో వెబ్ సైట్ అనేది అసలు ఎవరి ఊహకి అందని విషయం. అదీ కాకుండా అప్పటికి ఈ జియో నెట్వర్క్ , స్మార్ట్ ఫోన్ లు లేవు. ఇంటర్నెట్ అనేది ఇంకా గ్రామంలో కనీసం పది శాతం మందికి కూడా అందుబాటులో లేని సమయం అది. ఆ సమయంలో కొద్దిమంది మిత్రులు , ప్రవాసులు అందరం కలిసి దీనికి రూపాన్నిచ్చాము. చూస్తుండగానే 8 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు సమాచారం మరింత త్వరగా అందుతోంది. ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రిపోర్టర్ గా మారిపోయారు. గ్రామంలో ఏది జరిగినా నిమిషాల్లో ఫేస్బుక్ లో ప్రత్యక్షమవుతుంది. తద్వారా ఘంటసాల పేజీ కి కూడా ఆ సమాచారం తక్షణం చేరుతోంది. ఈ సంవత్సరం ఫేస్బుక్ పేజీ ని అనుసరించే వారి సంఖ్య 2000 దాటింది. ఇక ఈ సంవత్సరం చెప్పుకోతగ్గ మైలు రాళ్ళలో బుద్ధ విహార్ ప్రాజెక్ట్ గ్రామానికి మంజూరు అవ్వటం , శ్రీ గొర్రెపాటి రంగనాథ బాబు గారు తన 4 ఎకరాల పొలాన్ని వితరణగా ఇవ్వటం గ్రామాభివృద్ధిలో కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్ మంజూరు కి కృషి చేసిన ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి , కలెక్టర్ శ్రీ లక్ష్మీ కాంతం గారికి గ్రామస్తుల తరపున కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాము. ఈ సంవత్సరం మరో మరిచిపోలేని ఘట్టం , మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని ఆయనతో సావధానంగా ఘంటసాల గ్రామం గురించి, ఈ వెబ్సైట్ ద్వారా జరుగుతున్న ప్రయోజనాల గురించి వివరించగలగటం. నేను దుబాయ్ లో ఉండటం , ఆయన దుబాయ్ పర్యటన సందర్భంగా ఆయనకి ఆహ్వానం పలికే కమిటీ లో సభ్యుడిగా ఉండటం వల్ల ఇది సాధ్యమైనది. ఘంటసాలని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెయ్యాలనే నా వినతి ని ఆయన సావధానముగా వినటమే కాకుండా పారిస్ లో ఉన్న ఘంటసాల శిల్పాల గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తుందని తెలిపారు. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ని ఆయన సెక్రటరీ కి ఇవ్వటం జరిగింది. నేను విదేశాల్లో ఉంటున్నా కూడా ఈ వెబ్సైట్ ని నిరాఘాటంగా నడపటానికి కారణం కేవలం ఇప్పుడొస్తున్న సమాచార విప్లవమే. స్వచ్ఛ ఘంటసాల బృందం కేవలం స్వచ్ఛ కార్యక్రమాలే కాకుండా గ్రామంలో సంస్కృతీ సాంప్రదాయాలు బాల బాలికల్లో పెంపొందే విధంగా కృషి చెయ్యటం చాలా సంతోషించే విషయం. వారికి మా హృదయపూర్వక అభినందనలు. ఈ వెబ్సైట్ ఆవశ్యకతని గుర్తించి ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ నిరంతరం సమాచారాన్ని అందిస్తూ గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుబడే శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారికి మా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. ఇంకా మరెన్నో ప్రణాళిక లతో ముందు సాగుతామని తెలియచేస్తూ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 

 

This text will be replaced