కర్మ యోధుడు కృష్ణారావుBack to list

 ఇలా ఎన్నో ఆశ్చర్యాసక్తులతో పుస్తకం తెరిచిన నాకు మొదటి పేజీ లో ఉన్న వడ్లమూడి కృష్ణారావు గారి స్వగ్రామం చూడగానే మరో షాక్. ఇక అక్కడినుండి 2 గంటలపాటు నా కళ్ళు , మనసు అక్షరాల వెంట పరుగు ఆపలేదు.ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామం నుండి తూర్పు లంకపల్లి కి అక్కాబావలతో పాటు అరణంగా వెళ్లిన శ్రీ వడ్లమూడి రాఘవయ్య అనే ఒక సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి, బాల్యమంతా చల్లపల్లి, ఘంటసాల , దాలిపర్రు ,ఘంటసాల పాలెంలో గడిపిన వ్యక్తి , రాయలసీమలో భూ పోరాటాల కి ఊపిరి పోసి భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పరిటాల శ్రీరాములు గారికి అల్లుడవ్వటం, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత ప్రజాదరణ గలిగిన పరిటాల రవి కుటుంబం ఎదుగుదలకి కారకుడవ్వటం, పరిటాల రవి మరణానంతరం ఆ కుటుంబాన్ని వారి వారసుల్ని కంటికి రెప్పలా కాపాడి పరిటాల కుటుంబ వారసుడిని మళ్ళీ అనంతపురం ప్రజల చెంతకి చేర్చటం వరకు సాగిన కర్మయోగి ప్రయాణం ఈ పుస్తకం. 


ఎక్కడి కృష్ణాజిల్లాలో లంకపల్లి , ఎక్కడి అనంతపురం జిల్లాలో వెంకటాపురం? బహుశా విధి అంటే ఇదేనేమో. చల్లపల్లి శ్రీమంతురాజా వారి బడిలో పి యూ సి చదువుకుని 1967 లో ఇంజినీరింగ్ చదవటానికి అనంతపురం జె ఎన్ టి యు కి వెళ్లిన ఒక విద్యార్థి అప్పటి నక్సల్బరీ ఉద్యమం పట్ల ఆకర్షితుడై, కామ్రేడ్ రాజారామ్ రెడ్డి ని ఆరాధిస్తూ, కొండపల్లి సీతారామయ్య , చారుమజుందార్ లాంటి ఉద్దండులతో పని చేసి, పార్టీ మాటే శిరోధార్యంగా భావించి అనంతపురాన్నే తన కర్మ భూమిగా చేసుకుని మళ్ళీ అక్కడినుండి హైదరాబాదులో దశాబ్ద కాలం సాధారణ జీవితాన్ని గడిపి మళ్ళీ పార్టీ ఆదేశంతో పరిటాల రవి సోదరి శైలజని వివాహం చేసుకుని మళ్ళీ పదేళ్ల తరువాత వెంకటాపురంలో అడుగుపెట్టటం వరకు ఎన్నో ఎత్తుపల్లాల, ఒడిదుడుకుల జీవితాన్ని గడిపిన కృష్ణారావు కొద్దికాలానికే పరిటాల రవి మరణాంతరం మళ్ళీ ఆ కుటుంబ బాధ్యతని మోసిన తీరు మన హృదయాల్ని చెమరిస్తుంది.పరిటాల శ్రీరాములు నుండి శ్రీరామ్ దాకా నాలుగు తరాల పాటు ఆ కుటుంబానికి భుజం కాసినా చివరికి పరిటాల శ్రీరామ్ ని ప్రజలకి పరిచయం చేసే వేదిక పై తనని ఒక్కరు కూడా తలచుకోలేదని ఆయన మనసు గాయపడింది అని రాశారు రచయిత. ఆ వాక్యంలో కృష్ణారావు గారి మనసు కంటే ఈ పుస్తక రచయిత మనసే ఎక్కువ గాయపడినట్లు అనిపిస్తుంది. ఇదొక్కటే కాదు,పుస్తకంలో ఆద్యంతం కృష్ణారావు గారి మీద రచయితకున్న అభిమానం , జాలి , ప్రేమ , ఆయనకి తగిన గుర్తింపు రాలేదన్న బాధ రచయిత కలంలో నుండి జాలువారాయి.

 

జీవిత చరమాంకంలో కూడా కామ్రేడ్ రవూఫ్ స్మారక చిహ్నం కోసం ఆయన పడిన తపన, కరుడు గట్టిన కమ్యూనిస్టుల నిబద్ధత ఈ కాపిటలిస్టు ప్రపంచం ఇసుమంత కూడా మార్చలేదని రుజువు అయ్యింది.

ఆయన నడయాడిన ఘంటసాల పరిసర ప్రాంతాల్లోనే నేను పుట్టి పెరిగాను.ఆయన జన్మించిన తూర్పు లంకపల్లి లో ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో నా వివాహం జరిగింది.నా సతీమణి వడ్లమూడి వారింటి అమ్మాయి. ఆయన నెలకొల్పిన రత్నా ఇండస్ట్రీస్ ఉన్న హైదరాబాదులో బాలానగర్ గాంధీనగర్ పారిశ్రామిక వాడలో నేను 5 సంవత్సరాలు పనిచేసాను.ఆయన నివసించిన కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ కి కొన్ని వందల సార్లు వెళ్లి ఉంటాను. ఘంటసాల చుట్టూ పక్కల ప్రాంతాల వారంతా ఎక్కువ సంఖ్యలో నివసించే కాలనీ అది. ఫిలింనగర్ లో సినిమా అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఎత్తైన గోడల మీద మొనతేలి ఉన్న ఇనుప చువ్వల ఇంటిని చూస్తూ ఇదే పరిటాల రవి ఇల్లు అనుకుంటూ కొన్ని పదుల సార్లు ఆ ఇంటి చుట్టూ తిరిగి ఉంటాను. ఆ సమయంలో ఆయన ఆ ఇంట్లోనే నివాసం ఉన్నారు. నాకు తెలీకుండానే నేను ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.

ఈ పుస్తకం చదివాక నేను చాలాసేపు తేరుకోలేకపోయాను. అంతిమంగా నేను బాధ పడింది ఒకే విషయానికి.వడ్లమూడి కృష్ణారావు గారు బ్రతికుండగా నాకు ఇవన్నీ తెలిసుంటే ఒక్కసారైనా ఆయన్ని కలిసేవాడిని కదా.

 Dated : 05.05.2017

This text will be replaced